*నవభారత్ న్యూస్
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2024*
*వైభవంగా భవానీ దీక్షా విరమణలు*
- సజావుగా ఆధ్మాత్మిక శోభతో తొలిరోజు కార్యక్రమం
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ
- భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నవభారత్ న్యూస్ ప్రతినిధి రామకృష్ణ
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం తొలిరోజు శనివారం వైభవంగా ఆధ్యాత్మిక శోభతో సజావుగా సాగుతోందని, ఏ ఒక్క భక్తునికీ ఎలాంటి ఇబ్బందిలేకుండా చాలా పకడ్బందీగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
శనివారం కలెక్టర్ లక్ష్మీశ భవానీ దీక్షా విరమణల కార్యక్రమాన్ని పరిశీలించారు. తొలుత మోడల్ గెస్ట్‌హౌస్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి.. సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్‌ను పరిశీలించారు. తక్షణ స్పందన వ్యవస్థ ద్వారా సమస్యలను ఎలా త్వరితగతిన చక్కదిద్దవచ్చనే దానిపై వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. అనంతరం క్యూలైన్లను పరిశీలించి.. భవానీ భక్తులతో మాట్లాడారు. ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు ఒకవేళ తప్పిపోతే వారి జాడను వెంటనే తెలుసుకునేందుకు ఈసారి దుర్గమ్మ ఆలయం అందుబాటులోకి తెచ్చిన చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) పనితీరును పరిశీలించారు. స్వయంగా చిన్నారుల చేతికి క్యూఆర్ కోడ్ బ్యాండ్ వేశారు. ఘాట్లు, క్యూ లైన్లు, నిరీక్షణ గదులు, దర్శనం, ప్రసాదం కౌంటర్లు, హోమ గుండాలు, గిరి ప్రదక్షిణ, అన్న ప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. డ్రోన్ దృశ్యాలను నిరంతరం పరిశీలిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారమిచ్చి, పరిస్థితులను చక్కదిద్దుతున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థ ద్వారా నిరంతర సూచనలు ఇస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఆలయ ఈవో కేఎస్ రామరావు, ఉప కార్యనిర్వహణ అధికారి రత్నరాజు తదితరులు పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)