*నవభారత్ న్యూస్
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 20, 2024*
*తప్పిపోయిన చిన్నారుల జాడను ఇట్టే కనిపెట్టే యాప్*
- కలెక్టర్ డా. జి.లక్ష్మీశ చొరవతో అందుబాటులోకి..
- భవానీ దీక్షల విరమణల్లో సేవలందించనున్న ఆన్‌లైన్ వ్యవస్థ
అంతవరకు సరదా సరదాగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద అలజడి.. తమతో పాటు ఉన్న నాలుగేళ్ల చిన్నారి అకస్మాత్తుగా కనిపించకపోయే సరికి అంతులేని ఆవేదన! తిరిగి ఆ చిన్నారి చెంతకు చేరేవరకు ఒకటే కలవరం.. ఇలాంటి పరిస్థితులు ఉత్సవాల సమయాల్లో చూస్తుంటాం!
ఇలా తప్పిపోయిన చిన్నారుల సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు సత్వరం తెలియజేప్పేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలతో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. దాదాపు అయిదారు లక్షల మంది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సమయంలో దురదృష్టవశాత్తు తప్పిపోయిన చిన్నారుల జాడను ఇట్టే తెలుసుకునేందుకు సీఎంఎస్ యాప్‌ను ఉపయోగించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్ల ద్వారా చిన్నారుల వివరాలను నమోదు చేసి, చేతికి క్యూఆర్ బ్యాండ్ వేస్తారు.. పిల్లలు తప్పిపోయిన సందర్భంలో భద్రత, ఉత్సవాల సిబ్బంది లేదా ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ఆ పిల్లల సమాచారం తెలుస్తుంది.
QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత, పిల్లల పేరు, తల్లిదండ్రుల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, తల్లిదండ్రులతో ఫోన్ కాల్ చేయడానికి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి ఆప్షన్లు చూపిస్తుంది. దీంతో తేలిగ్గా చిన్నారులను వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చొచ్చని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ సీఎంఎస్ పనితీరును పరిశీలించారు. చేయాల్సిన మార్పులపై అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నొవేషన్స్ సీఎండీ అనీల్ కుమార్‌కు సూచనలు చేశారు. ఈ ఆన్‌లైన్ వ్యవస్థపై ప్రజలు కూడా అవగాహన పెంపొందించుకోవాలని.. ఎక్కడైనా తప్పిపోయిన చిన్నారులు కనిపిస్తే వెంటనే క్యూఆర్ బ్యాండ్‌ను స్కాన్ చేసి.. సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)