నవభారత్ న్యూస్....
*
*ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 17, 2024*
*డీఆర్‌సీలోని ప్రతి అంశంపైనా ప్రత్యేక దృష్టిపెట్టండి*
- విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడిన పనులను సత్వరం పూర్తిచేయాలి
- వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి దిశగా పయనించాలి
- సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను నెం.1గా నిలపాలి
- అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యుల మార్గనిర్దేశం, ప్రజాప్రతినిధుల సహకారంతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను నెం.1గా నిలిపేందుకు అధికారులు సమష్టిగా కృషిచేయాలని.. జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశంలో చర్చకు వచ్చిన, నిర్ణయం తీసుకున్న వివిధ అంశాల కార్యాచరణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
నవంబర్ 30న విజయవాడ, ఇరిగేషన్ కాంపౌండ్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 34 శాఖల పరిధిలోని అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై సమీక్షించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు వివిధ అంశాలను లేవనెత్తారు. ఈ అంశాలపై ఆయా శాఖలు ఏ మేరకు కార్యాచరణ రూపొందించుకున్నాయి? ప్రస్తుత పురోగతి ఏమిటి? తదితర అంశాలపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలతో పాటు మార్కెటింగ్, పర్యాటకం, ఏపీసీపీడీసీఎల్, గృహ నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలు తదితర శాఖల వారీగా చర్చించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆదాయంలో 20 శాతం మొత్తంతో లింకు రోడ్ల అభివృద్ధి, రైతుల నుంచి సేకరించిన పత్తిని జిన్నింగ్ మిల్లులకు తరలింపు ఏర్పాట్లు, రైతు బజార్ల ప్రక్షాళన, పంట నష్టాలకు సంబంధించి కౌలు రైతులకు పరిహారం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)పై రైతులకు అవగాహన, తుమ్మలపాలెం ఎత్తిపోతలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా, పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మతుపనులు, అమృత్ పథకం పనులు, జల్ జీవన్ మిషన్ పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన, చిన్ననీటి వనరుల అభివృద్ధి, పర్యాటక అభివృద్ధి తదతర అంశాలపై చర్చించారు. డీఆర్‌సీలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు తెలిపారు. విస్తృత ప్రజాప్రయోజనాలతో ముడిపడిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు కృషిచేయాలని, అవసరమైన వాటికి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సమావేశంలో సిపిఓ వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)