నవభారత్ న్యూస్.. నెల్లూరు.....
ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్న హనుమంతరావు కష్టానికి ఫలితం - కుటుంబ సభ్యులకు అభినందనలు
నెల్లూరు జిల్లావలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్న ముతకని హనుమంతరావును నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం ఘనంగా సత్కరించారు. 2023- 24 ఏడాదికి గాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన ఎంపికయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 137 వ జన్మదినోత్సవం , గురుపూజోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఐఏఎస్ , జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా ఈయన ఉత్తమ
ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎం మల్లికార్జున రావు సీనియర్ జర్నలిస్ట్ కే సి హెచ్ రమణయ్య యుటిఎఫ్ సీనియర్ నాయకుడు మన్నం మాధవరావుతోపాటు పలువురు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఆయనను అభినందించారు.
సుమారు 50 ఏళ్ల కిందట అల్లరి చిల్లరిగా తిరిగే హనుమంతరావు అనే బాలుడు ప్రయోజకుడు అయ్యారు."పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ " అను సుమతి శతకం పద్యం నేడు అక్షరాల రుజువు చేశారు. ఆదర్శంగా నిలిచారు. తన విద్యాభ్యాసం ద్వారా తను బాగుపడ్డారు. తన కుటుంబాన్ని తీర్చిదిద్దారు.తన ఇద్దరు కుమారులను ప్రయోజకులను చేశారు. వీరితోపాటు అనేక మంది విద్యార్థుల జీవనోపాధికి మార్గము సుగమము చేస్తున్నారు. వీరిది రైతు కుటుంబము.కాకర్ల పాలెం గ్రామానికి చెందిన స్వర్గీయ రాములు సుబరాజ్యమ్మ దంపతులకు రెండవ సంతానంగా ఈయన జన్మించారు.
హనుమంతరావు బాల్యము నుంచి ఏ పని చేయాలన్నా కృషి పట్టుదలతో చేసేవారు. హై స్కూలు స్థాయిలోనే ఆయన కళారంగం పట్ల మక్కువ చూపేవారు. అభ్యుదయ భావాలు గల సాంఘిక నాటకాల ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేసేవారు. ఇందులో భాగంగానే ఆనాటి కళాకారుడు దర్శకుడు అయినా బిళ్లా కోటయ్య దర్శకత్వంలో హనుమంతరావు ప్రదర్శించిన "ఊరు ఉమ్మడి బ్రతుకులు", " మీరైతే ఏం చేస్తారు" తదితర నాటికలు ప్రేక్షకులను అలరించాయి. నిరక్షరాస్యత కుటుంబంలో జన్మించినప్పటికీ బి.ఏ.బి.ఈడి చదివారు.పద్మావతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. మంచి చదువులు చదివించారు. ప్రస్తుతం ఒకరు జర్మనీలోనూ మరొకరు చెన్నైలోనూ ఉన్నారు. 1996 డీఎస్సీలో ఆయన సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఉద్యోగం సంపాదించారు. అప్పటి నుంచి తన బాల్యము నుంచి గల అభ్యుదయ భావాలను కొనసాగిస్తూ విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేస్తున్నారు. తద్వారా పలువురు మన్ననలు పొందుతున్నారు.ఆయన కృషిని గతంలోనే ఓ స్వచ్ఛంద సంస్థ గుర్తించి ఉత్తమ టీచర్ గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈయన పని తీరును మండల విద్యాశాఖ సైతం గుర్తించింది.జిల్లా అధికారులను కదిలించింది. దీంతో హనుమంతరావు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను జిల్లా యంత్రాంగము ప్రశంసా పత్రాలతో సత్కరించింది. ఇందుకు ఎంఈఓ మల్లికార్జున్ తోపాటు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహస్వామి, సీనియర్ జర్నలిస్ట్ కే సిహెచ్ రమణయ్య అయ్యవారిపల్లె సర్పంచ్ డేగ. .వెంకటేశ్వర్లు,సీనియర్ అడ్వకేట్ ప్రగడ శ్రీనివాసులు తదితరులు హనుమంతరావును అభినందించారు.
ఈ సందర్భంగా సన్మానగ్రహీత హనుమంతరావు మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు,నా సోదరులు మరియు కుటుంబ సభ్యుల సహకారం వలనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు అన్నారు.